సూపర్ స్టార్ మహేష్ బాబు తన తర్వాతి చిత్రంగా సర్కారు వారి పాట ప్రకటించినప్పటి నుండి అభిమానుల సందడి షురూ అయింది. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కియారా అద్వానీ, సాయి మంజ్రేకర్ పేర్లు వినిపిస్తున్నా ఎవరు ఫైనల్ అవుతారనేది క్లారిటీ లేదు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త బయటకి వచ్చింది. ఈగ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన కన్నడ హీరో సుదీప్, సర్కారు వారి పాటలో మహేష్ కి విలన్ గా కనిపించనున్నాడట. ఈ విషయమై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. కిచ్చ సుదీప్ తెలుగులో చాలా సినిమాల్లో కనిపించాడు. అటు కన్నడలో హీరోగా సినిమాలు చేస్తూనే, తెలుగులో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు.
మొన్నటికి మొన్న సైరాలో విలక్షణమైన పాత్రలో మెరిసాడు. మరి సర్కారు వారి పాటలో విలన్ గా సుదీప్ చేస్తున్నాడన్నది నిజమా కాదా తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. కాకపోతే మహేష్ బాబుకి విలన్ గా కిచ్చ సుదీప్ సరిగ్గా సరిపోతాడని అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.