గత ఏడాది బాలయ్యకి కలిసిరాలేదని చెప్పాలి. ఎన్టీఆర్ కథానాయకుడు రెండు భాగాలు కూడా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన రూలర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమా ద్వారా బాలయ్య మార్కెట్ చాలా పడిపోయింది. ముఖ్యంగా బాలయ్య లుక్ కి వచ్చిన స్పందన ఎలాంటిదో అందరికీ తెలుసు. ఇలాంటి తరుణంలో బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
అయితే బోయపాటి కూడా వినయ విధేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. దాంతో బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. బాలయ్య 60వ పుట్టినరోజుని పురస్కరించుకుని రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్ లో నిలిచింది.
ఈ దెబ్బతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా టీజర్ లో బాలయ్య లుక్ చాలా బాగుంది. అదీ గాక పవర్ ఫుల్ డైలాగ్ మాస్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ లెక్కన చూస్తే టీజర్ ద్వారా బాలయ్య సిక్సర్ కొట్టినట్టే. ఇంకా టైటిల్ కూడా నిర్ణయించబడని ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా ఇలాంటి ప్రభంజనమే చూపిస్తుందేమో చూద్దాం.