కరోనా కారణంగా చిత్రపరిశ్రమకి తీవ్ర నష్టం చేకూరింది. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో ఇంకా నష్టం వాటిల్లుతూనే ఉంది. రోజు రోజుకీ కరోనా ఉధృతి మరింత పెరుగుతుండడంతో భవిష్యత్తు ఎలా ఉంటుందనేది సందేహంగా మారింది. అయితే ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులకి అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరూ మళ్ళీ చిత్రీకరణకి రెడీ అవుతున్నారు. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తల నడుమ చిత్రీకరణ జరిపేందుకు ముందుకు వస్తున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల తెలంగాణ, ఆంధ్రా మినహా ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం కష్టమే. అందుకే చాలా మంది నిర్మాతలు ఇక్కడే పని కానిచ్చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పుష్ప టీమ్ భారీ సెట్స్ వేయాలని డిసైడ్ అయిందట. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అందువల్ల ఎక్కువ భాగం అడవుల్లోనే చిత్రీకరించాలి.
అయితే అడవుల్లో చిత్రీకరించాల్సిన భాగాన్ని వదిలేసి, మిగతా భాగమంతా ఇక్కడే సెట్ వేసి కానిచ్చేయాన్మి చూస్తున్నారు. పాటలతో సహా మిగిలినదంతా తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లోనే సెట్స్ వేసి కంప్లీట్ చేస్తారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.