ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అయిన విషయం తెలిసిందే. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో సినిమా షూటింగ్‌లతో పాటు, ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధి, స్టూడియోల నిర్మాణం ఇలా కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలు తన దృష్టికి తీసుకొచ్చిన విషయాలన్నింటిపైనా వైఎస్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా సినిమా టికెట్‌లు, ఫ్లెక్సీ రేట్లు పరిశీలన, థియేటర్ల కరెంట్ బిల్లులపై, విశాఖలో ఇండస్ట్రీ అభివృద్ది, నంది అవార్డుల ఫంక్షన్ నిర్వహణ చుట్టూనే భేటీ జరిగింది. భేటీ అనంతరం మీడియా మీట్ నిర్వహించి మెగాస్టార్ చిరంజీవి.. జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ట్విట్టర్ ద్వారా కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పారు.
ఈ భేటీకి దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న కూడా హాజరయిన విషయం విదితమే. భేటీ అనంతరం ఇంటికి చేరుకున్నాక ట్విట్టర్ వేదికగా భేటీలో జరిగిన విషయాలపై తన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. ‘ఏపీ సీఎం జగన్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం ఏర్పడి సినీ రంగం, థియేటర్ల యాజమాన్యాలు కుదేలైన నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు సీఎం జగన్ ఓ భరోసా కల్పించారు. థియేటర్ల విద్యుత్ విషయంలో కనీస ఫిక్సడ్ చార్జీలపై గొప్ప నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ల యాజమాన్యాలకు ఈ నిర్ణయం తప్పక ఊరట కలిగిస్తుంది’ అని ట్విట్టర్ వేదికగా జక్కన్న తన అభిప్రాయాన్ని తెలియజేశారు.