ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అయిన విషయం తెలిసిందే. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో సినిమా షూటింగ్‌లతో పాటు, ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధి, స్టూడియోల నిర్మాణం ఇలా కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలు తన దృష్టికి తీసుకొచ్చిన విషయాలన్నింటిపైనా వైఎస్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా సినిమా టికెట్‌లు, ఫ్లెక్సీ రేట్లు పరిశీలన, థియేటర్ల కరెంట్ బిల్లులపై, విశాఖలో ఇండస్ట్రీ అభివృద్ది, నంది అవార్డుల ఫంక్షన్ నిర్వహణ చుట్టూనే భేటీ జరిగింది. పెద్దలు చెప్పిన విషయాలన్నింటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించి.. అన్ని విషయాలపై పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. అంతేకాదు.. వచ్చే నెల అనగా జూలై-15న మరోసారి సినీ పెద్దలతో తదుపరి విషయాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు. కాగా.. భేటీ అనంతరం.. అసలు భేటీలో ఏం జరిగింది..? జగన్ దృష్టికి ఏమేం తీసుకెళ్లారు..? ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు..? అనే విషయాలపై నిశితంగా మీడియా ముఖంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.
జగన్ మాటిచ్చారు.. చాలా ఆనందం!
‘ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి వెన్నంటే ఉంటానని సీఎం జగన్ మాటిచ్చారు. సీఎం ఆ మాట చెప్పడం నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశాఖలో స్టూడియోకి వైఎస్ఆర్ హయాంలో భూమి ఇచ్చారు. దానిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని జగన్ మాటిచ్చారు. ఏపీలో కూడా సినిమా షూటింగ్స్‌కు జగన్ అనుమతిచ్చారు. థియేటర్ల మినిమం ఫిక్స్‌డ్ ఛార్జీలు ఎత్తేయాలను కోరాం. టికెట్ల ధరల ఫ్లెక్సీల రేట్లపై దృష్టిపెట్టాలని కోరాం. మేం చెప్పిన అన్ని విషయాలపై జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ అన్ని విషయాలపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు కోరుకుంటున్నాం. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం. అడిగినవి అడిగినట్లుగా జగన్ సానుకూలంగా స్పందించినందుకు మా ఇండస్ట్రీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కాగా.. సీఎం జగన్‌తో జరిగిన భేటీలో చిరుతో పాటు అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాత సి. కళ్యాణ్, నిర్మాత దిల్ రాజుతో పాటు మరికొందరు ఉన్నారు.