ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అయిన విషయం తెలిసిందే. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో సినిమా షూటింగ్‌లతో పాటు, ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధి, స్టూడియోల నిర్మాణం ఇలా కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలు తన దృష్టికి తీసుకొచ్చిన విషయాలన్నింటిపైనా వైఎస్ సానుకూలంగా స్పందించి.. వరాల వర్షం కురిపించారు. మరీ ముఖ్యంగా అందరికంటే ముందుగా ఏపీలో షూటింగ్స్ చేసుకోవచ్చని జగన్ సర్కార్ ఉత్వర్వులు సైతం జారీ చేసింది. తాజాగా అందుకు సంబంధించి ముహూర్తం కూడా జూన్- 15 అని అటు ప్రభుత్వం.. ఇటు పెద్దలు ఫిక్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన విదివిధానాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇంతకీ ఇండస్ట్రీ పెద్దలు సీఎంను ఏమేం కోరారు..? వైఎస్ జగన్ ఏమని హామీ ఇచ్చారు..? ఇంతకీ జగన్ ఇచ్చిన ఆ వరాలేంటి..? అనేవి ఈ కథనంలో చూద్దాం.
వరాలు ఇవీ..
- వైఎస్ హయాంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం వైజాగ్‌లో 300 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. దానిపై తాజాగా చర్చ జరిగింది. ఏపీలో ఎవరైనా సరే స్టూడియోలు కట్టుకోవచ్చు. ఇక్కడే ఉండాలని అనుకునేవారికి ఆ 300 ఎకరాల్లో భూమిని కేటాయించయిడానికి నేను సిద్ధంగా ఉన్నాను
- పాత నంది అవార్డులను కాకుండా 2019-20 సంవత్సరం నుంచి ఏపీ ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను
- సినిమా స్టార్స్, సీజన్‌ను బట్టి సినిమా టికెట్ రేట్స్‌ను పెంచుకోవడానికి కావాల్సిన అనుమతులను పరిశీలిస్తాం
- అలాగే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తే టికెటింగ్ విషయంలో జరిగే మోసాలను తగ్గించవచ్చనే మీ అభ్యర్థనను కచ్చితంగా పరిశీలిస్తాం
- రన్ కానీ థియేటర్స్ విషయంలో వచ్చే కరెంట్ బిల్లులకు సబ్సిడీ ఇవ్వాలని మీరు కోరిన విషయాలపై త్వరలోనే పరిశీలించి ఓ నిర్ణయానికొస్తాం
- చిన్న సినిమాలకు ఎప్పటి నుంచో ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీల విషయంపై పరీశీలిస్తాం అని టాలీవుడ్ పెద్దలకు జగన్ హామీ ఇచ్చారు.
మొత్తమ్మీద చూస్తే.. టికెట్‌లు, ఫ్లెక్సీ రేట్లు పరిశీలన, థియేటర్ల కరెంట్ బిల్లులపై, విశాఖలో ఇండస్ట్రీ అభివృద్ది, నంది అవార్డుల ఫంక్షన్ నిర్వహణ చుట్టూ భేటీ జరిగిందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాగా సినీ పెద్దలు తన దృష్టికి తీసుకొచ్చిన విషయాలపై ఇప్పటికే వరాల వర్షం కురిపించిన వైఎస్ జగన్.. వచ్చే నెల అనగా జూలై-15న మరోసారి సినీ పెద్దలతో చర్చ జరగబోతోంది. తదుపరి విషయాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు.