పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడమే సంచలనం. రాజకీయాలంటూ జీవితం గడిపేస్తున్న పవన్ ఉన్నట్టుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం వెనుక త్రివిక్రమ్ హస్తం ఉందనేది ప్రచారం మాత్రమే కాదు.. నిజం. ఆ విషయం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే తనకి చాలా ఇష్టమని.. ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పిన వేణు శ్రీరామ్ గత ఏడాది ఒక సినిమా విషయంలో దిల్ రాజుని కలవగా దిల్ రాజు తనని త్రివిక్రమ్ దగ్గరకి తీస్కెళ్లాడని... అక్కడ త్రివిక్రమ్ - దిల్ రాజు పింక్ రీమేక్ గురించి చర్చించారని.. ఆ సినిమా చేసే అవకాశం తనకే వస్తుంది అని అప్పట్లో తాను అనుకోలేదని చెబుతున్నాడు వేణు శ్రీరామ్. ఇక త్రివిక్రమ్ పింక్ రీమేక్ కి మాటలు రాయాల్సి ఉండగా.. ఆయన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిజీగా ఉండి రాయలేకపోయారనే విషయము చెబుతున్నాడు వేణు శ్రీరామ్.
ఇక పవన్ కళ్యాణ్ మీరు పుస్తకాలూ చదువుతారా అని అడుగుతుంటారని.. ఇక పవన్ కళ్యాణ్ తో షూటింగ్ ఎలా ఉంది అంటే.. చాలా బావుంది అని.. పవన్ ఓ పుస్తకం లాంటివారు.. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెబుతున్న వేణు శ్రీరామ్, పవన్ కళ్యాణ్ కంగారులో కూడా మీరు అనడం మరిచిపోరని.. సెట్ లో అందరితో బాగా ఉంటారని.. ఆయన చుట్టూ ఉన్న మనుషులను ఎలా గౌరవించాలో తెలుసనీ, పింక్ కథ పవన్ కళ్యాణ్ కి కరెక్ట్ గా సరిపోతుంది అని.. కాకపోతే ఆయనతో డైరెక్ట్ సినిమా చేద్దామని ఉండేదని.. కానీ ఈ రీమేక్ కూడా పవన్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని అంటున్నాడు వేణు శ్రీరామ్. ఆయన అభిమానులకు కావాల్సిన హంగామా అంతా వకీల్ సాబ్ లో ఉండబోతుంది అంటున్నాడు ఈ సినిమా దర్శకుడు వేణు.