కోవిడ్ 19 కారణంగా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేనందున చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అమృతరామమ్, తమిళంలో పొన్మగల్ వంధామ్ చిత్రాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. తాజాగా మరో తెలుగు సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. బాహుబలి సినిమా నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని గార్లు నిర్మించిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సత్యదేవ్ హీరోగా చేసిన ఈ సినిమాని కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా డైరెక్ట్ చేసాడు. మళయాలంలో సూపర్ హిట్ అందుకున్న మహేషింటే ప్రతీకారం చిత్రానికి తెలుగు రీమేకే ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య. కోవిడ్ 19 మూలంగా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోవు. ఒకవేళ తెరుచుకున్నా పెద్ద సినిమాలు పోటీ పడుతుంటాయి. అలాంటప్పుడు చిన్న సినిమాలకి థియేటర్లు దొరకవు. వీటన్నింటి వల్ల ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడమే ఉత్తమం అని భావిస్తున్నారట.
అల్లు అరవింద్ ఆహా యాప్ ఈ సినిమాకి ఫ్యాన్సీ రేటుని చెల్లించిందని సమాచారం. తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమాకి ఆహా మంచి ధరనే చెల్లించిందని అంటున్నారు. ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మరిన్ని చిత్రాలు డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.