లాక్డౌన్ మొదలయినప్పటి నుండి థియేటర్లు మూతబడిపోవడంతో జనాలు ఓటీటీ వేదికలకి బాగా అలవాటు పడ్డారు. వినోదం కోసం ఓటీటీని ఆశ్రయించే వారు పెరగడంతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కి సబ్ స్క్రయిబర్లు పెరిగారు. దాంతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కొత్త సినిమాలని రిలీజ్ చేసి సబ్ స్క్రయిబర్లని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ తన రూల్స్ మార్చనుందట.
ప్రస్తుతం సంవత్సరానికి సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే అమెజాన్ లో ఉన్న ఏ సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా చూడవచ్చు. కానీ ఇక ముందలా ఉండకపోవచ్చని అంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన సినిమాలని, వెబ్ సిరీస్ లని చూడడానికి పే పర్ వ్యూ పద్దతిని అవలంబించనున్నారట. డిజిటల్ వేదికగా రిలీజ్ అయ్యే భారీ సినిమాలకి ఈ విధమైన రూల్స్ ఉండేందుకు అవకాశం ఉందని అంటున్నారు.
కేవలం సబ్ స్క్రయిబర్లని పెంచుకోవడం మాత్రమే లక్ష్యంగా చేసుకుని సినిమాలని కొనుక్కుంటూ వెళ్తే లాభం లేదని, ఇలాంటి స్పెషల్ ప్లాన్స్ ఉంటేనే సంస్థకి లాభం తీసుకురావచ్చని భావిస్తున్నారట. ఒక్క అమెజాన్ మాత్రమే కాదు మిగతా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కూడా ఇలాంటి పద్దతులని పాటించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాయి. అయితే విచిత్రమేంటంటే ఇదేమీ సరికొత్త రూల్ కాదు. చాలా రోజుల నుండి మనకు బాగా సుపరిచితమైన యూట్యూబ్ లో ఉన్నదే..