ఒక పాట హిట్ కావాలంటే మంచి సంగీతం కావాలి. మ్యూజిక్ డైరెక్టర్ మంచి బాణీలు ఇవ్వాలి. అంతే పాట హిట్ అవుతుందంటే అది అబద్ధమే అవుతుంది. ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాటలు వస్తున్నా అవి ప్రేక్షకులకి చేరకుండానే మరుగున పడిపోతున్నాయి. దానికి కారణం స్టార్ వాల్యూ. అవును ప్రేక్షకులు సినిమా చూడ్డానికి థియేటర్ కి రావాలంటే స్టార్ వాల్యూ ఎలా అవసరమో ఒక పాట ప్రేక్షకుల్లోకి వెళ్లాలన్నా కూడా అలాంటి స్టార్ వాల్యూ అవసరం.
కానీ కొన్ని పాటలు మాత్రమే స్టార్ వాల్యూ లేకున్నా సూపర్ సక్సెస్ అవుతుంటాయి. అలా సక్సెస్ అయిన పాటలో నీలి నీలి ఆకాశం పాట గురించి చెప్పుకోవాలి. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా చేస్తున్న 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని ఈ పాటకి 150 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. యాంకర్ గా బుల్లితెర మీద సక్సెస్ అయిన చాలా మంది వెండితెర మీద వెలగలేకపోయారు. కానీ ప్రదీప్ మాచిరాజు ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు.
చంద్రబోస్ రాసిన ఈ పాటకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. అమృత అయ్యర్, ప్రదీప్ మాచిరాజు కనిపించిన ఈ పాటకి యూట్యూబ్ లో విశేష ఆదరణ లభించింది. ఒక కొత్త హీరో పాటకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందంటే, ఆ కృషి మొత్తం సంగీత దర్శకుడితో పాటు సాహిత్యం అందించిన చంద్రబోస్ కి దక్కుతుంది. ముఖ్యంగా సాహిత్యం జనాలని బాగా ఆకర్షించిందనే చెప్పాలి.