సినిమాల్లో ఎంత డ్రామా ఉంటుందో సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వారి జీవితాల్లో కూడా అంత డ్రామా ఉంటుందని అంటారు. అయితే ఇది అందరి పట్ల నిజం కాకపోయినా చాలా మంది సినిమా వారి జీవితాల్లో ఇది నిజంగా నిజమే. ఎంతోమంది సినిమా వాళ్ళు ఇండస్ట్రీకి రాకముందు ఎవేవో పనిచేసుకుని బ్రతికినవారే. కానీ వారి ఆశల శిఖరం ఇండస్ట్రీ అని తెలుసుకుని ఇటొచ్చారు.. అనుకున్నది సాధించారు.
బాలీవుడ్ లో ఖాన్ త్రయం తర్వాత సూపర్ స్టార్ గా కొనసాగుతున్న వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. ప్రస్తుతం ఖాన్ త్రయాన్ని దూసుకుని ముందుకు వెళ్లాడనే చెప్పాలి. ఖాన్ లందరూ ఏడాదికి ఒక్క సినిమా తీయడానికే ఆపసోపాలు పడుతుంటే అక్షయ్ కుమార్ ఏడాదికి మూడు సినిమాలని రిలీజ్ చేస్తున్నాడు. అది కూడా మెరుగైన సక్సెస్ రేటుతో కావడం విశేషం. అయితే ప్రస్తుతం ఒక్కో సినిమాకి 50 కోట్లకి పైగా తీసుకుంటున్న అక్షయ్ కుమార్, హీరో అవకముందు చాలా తక్కువ జీతానికే పనిచేసారట.
బ్యాంకాక్ లోని ఒక ప్రముఖ హోటల్లో నెలకి 1500రూపాయల జీతానికి అక్షయ్ కుమార్ వెయిటర్ గా చేసాడట. వెయిటర్ నుండి చెఫ్ గా మారి అక్కడే పనిచేసాడట. అది కూడా తక్కువ జీతానికే. వెయిటర్ గా ప్రారంభమైన అక్షయ్ కెరీర్ స్టార్ హీరోదాకా ఎదిగింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ చిత్రం డైరెక్ట్ ఓటీటీ విడుదలకి సిద్ధం అవుతోందని అంటున్నారు. ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు.