టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం కేసీఆర్‌లతో సినీ పెద్దల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం సద్దుమణుగక ముందే మరో బాంబ్ పేల్చారాయన. దీంతో ఈ బాంబ్ ఎటెళ్తుందో అని ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ వ్యాఖ్యలను సంచలనం, బాంబ్ పేల్చాడు అనడం కంటే.. ఎక్కడో ఎవరికో టచ్ అయ్యే ఓ పెద్ద ఇష్యూని ఇవాళ బాలయ్య లేవనెత్తారు. అదేమిటంటే.. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు కొందరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) బిల్డింగ్ కోసం అమెరికాకు వెళ్లి మరీ స్పెషల్ షోలు వేసిన విషయం తెలిసిందే. దానిపై తాజాగా బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టాలీవుడ్‌లో జరిగిన వివాదం, తెలుగు రాష్ట్రాల రాజకీయాల వ్యవహారంపై బాలయ్య తాజాగా ఓ ప్రముఖ యూ ట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలను బయటపెట్టడమే కాకుండా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు కూడా. అవేమిటో ఈ కథనంలో చూద్దాం.
మిగతా రూ.4 కోట్లు ఏమయ్యాయ్!?
‘ అప్పట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కడతామన్నారు. అమెరికా వెళ్లారు.. నన్ను పిలిచారా? చిరంజీవి అంతా కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. రూ. 5 కోట్లు అన్నారు. వాటన్నింటిలో నేను కలుగజేసుకోను. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఫ్లవర్‌తో సమానం. ఆ బిల్డింగ్ ఇవాళ కట్టారా..?. ఇక్కడ (టీఆర్ఎస్) గవర్నమెంట్ ఇండస్ట్రీకి ఎంతో సపోర్టింగ్‌గా ఉంది. మేమంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి అంటున్నారు. మరి ఇవాళ అడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా?. ఇండస్ట్రీ నుంచి ఎంత టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు?. కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఆరాటం? కారణం ట్యాక్స్‌లు.. డబ్బు వస్తాయనే.! ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా ఇండస్ట్రీనే. ఇంత వరకు భవనం కట్టలేదు. ఒక్క బిల్డింగ్ కట్టడానికే.. మద్రాస్‌లో చూడండి. మేం (నటులంతా కలిసి) డబ్బులు పెట్టి కట్టుకోలేమా? ఆ ఆలోచనలు ఎందుకు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో రూ. 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి? ఏంటి ఇవన్నీ.. ఎవడు కూర్చుంటాడు. ఎందుకు.. ఏమన్నా లెక్కల మాస్టర్లా? అందుకే ఏం కలుగజేసుకోను. హిపోక్రసి, సైకోఫాంటసీలు ఎక్కువ. మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి..’ అని బాలయ్య మరోసారి బాంబ్ పేల్చారు.
చిరు ఏమంటారో!?
మొత్తానికి చూస్తే.. బాలయ్య మరో ఊహించని బాంబ్ పేల్చారు. మొన్న వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి హాట్ హాట్ కామెంట్సే చేశారు. ఇప్పటికే దానిపై ఒకరిద్దరు స్పందించి కౌంటర్ ఎటాక్ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అని పేరు చెప్పి మరీ ‘మా’ బిల్డింగ్, రూ. 5 కోట్ల సంగతేంటి..? అని గుచ్చి గుచ్చి మరీ బాలయ్య అడుగుతున్నారు. ఈ వ్యవహారంపై చిరు కచ్చితంగా స్పందించి.. పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి చిరు రియాక్ట్ అవుతారో లేకుంటే అబ్బే అంత అవసరం మనకు లేదులే అనేసి మిన్నకుండిపోతారో వేచి చూడాలి.