శర్వానంద్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. పడి పడి లేచే మనసు మొదలుకుని, రణరంగం ఆ తర్వాత జాను సినిమాలు ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం అతని ఆశలన్నీ శ్రీకారం సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో శర్వా యువరైతుగా కనిపించనున్నాడు.
అయితే శర్వాతో మూడు సినిమాలు తీసిన యూవీ క్రియేషన్స్ మరో మారు శర్వాతో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతోంది. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి సూపర్ హిట్ సినిమాలని నిర్మాతగా వ్యవహరించిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించడానికి శర్వా సిద్ధం అవుతున్నాడు. సంతోష్ అనే కొత్త దర్శకుడు చెప్పిన స్క్రిప్టుకి ఓకే చేసిన నిర్మాతలు మినిమమ్ బడ్జెట్ లో శర్వాతో సినిమా తీయాలని అనుకుంటున్నారట.
అయితే ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ప్రస్తుతం ఉన్న శ్రీకారం కాక శర్వా చేతిలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. అంటే ఈ చిత్రాలన్నీ పూర్తయ్యాకే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వ సినిమా ఉండనుందన్నమాట.