రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించిన ‘వాళ్లిద్దరి మధ్య’ లిరికల్ వీడియో సాంగ్
వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. విరాజ్ అశ్విన్, నేహాకృష్ణ ఇందులో హీరో హీరోయిన్లు. ఈ చిత్రంలోని ‘లత్కోరు లవ్వింతే’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని శనివారం హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించి, టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసి ఫస్ట్ కాపీ కూడా సిద్ధంచేసి ఉంచాం. మంచి కథకు మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్లు దొరకడం ఎంత ముఖ్యమో, పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చే నిర్మాత దొరకడం అంతకన్నా ముఖ్యం. అర్జున్ దాస్యన్ గారు ఎంతో అభిరుచితో ఈ సినిమా తీశారు. వ్యాపార రంగంలో విజయం సాధించినట్లుగానే, సినిమా నిర్మాణ రంగంలో కూడా ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారు. దాదాపుగా అంతా కొత్త ఆర్టిస్టులు అయినా కూడా 5 కోట్లు నిర్మాణ వ్యయంతో ఈ సినిమా తీశారు. ప్రసాద్ ల్యాబ్ వాళ్లు కూడా ఇన్ ఫ్రా పార్టనర్స్ గా వ్యవహరించడం విశేషం. సీనియర్ ఎడిటర్ మార్తాండ్. కె.వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ అశ్విన్ ఈ కథకు హీరోగా కరెక్టుగా కుదిరాడు. అమెరికాలో స్థిరపడిన తెలుగుఅమ్మాయి నేహాకృష్ణ ను కథానాయికగా పరిచయం చేస్తున్నాము. సీనియర్ నటుడు ఉత్తేజ్ కి చెందిన ‘మయూఖ స్కూల్’, ప్రసిద్ధిగాంచిన మహేష్ ‘అభినయ స్కూల్ ఆఫ్ యాక్టింగ్’లో శిక్షణ పొందిన కొంతమందిని ఈచిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాము. యూట్యూబ్ లో పాపులర్ అయిన ‘కిర్రాక్ సీత’ను కూడా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాము’’ అని చెప్పారు.
నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాతగా నాకిదే తొలి చిత్రం. వి. ఎన్.ఆదిత్య గారి అనుభవం వల్ల మేము నిర్మాణంలో ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ చేసాం. ఇప్పటి ట్రెండ్ కి తగట్టుగా ఉంటుందీ చిత్రం. మ్యూజిక్ డైరెక్టరుగా మధు స్రవంతిని పరిచయం చేస్తున్నాము. ప్రముఖ కెమరామెన్ PG విందా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన R.R. కోలంచి ఈ చిత్రం ద్వారా కెమరామాన్‌గా పరిచయం అవుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కి పని చేసిన ‘రియల్’ సతీష్ ఫైట్ మాస్టర్ గా,శిరీష్ కొరియోగ్రాఫర్ గా పని చేయడం మా చిత్రానికి అదనపు బలం. సిరాశ్రీ మంచి సాహిత్యం అందించారు. ఇండియాలోనే ఫేమస్ ఆయిన రామ్ గోపాల్ వర్మ గారి చేతులమీదుగా మా సినిమా లిరికల్ వీడియో లాంచ్ కావడం చాలా చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.
విరాజ్ అశ్విన్,నేహాకృష్ణ, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, వెంకట్ సిద్ధా రెడ్డి, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్, నిహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ధి, సుప్రజ, కృష్ణకాంత్, అలీ, భార్గవ్, రామకృష్ణ తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: సత్యానంద్, మాటలు: వెంకట్. డి. పతి, సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ, కెమెరా: RR. కోలంచి,ఆర్ట్ :JK.మూర్తి, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రవణ్ నిడమానూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సూరపనేని కిశోర్, నిర్మాత: అర్జున్ దాస్యన్, కథ- దర్శకత్వం: V. N. ఆదిత్య.