ఇప్పటికే వందల సంఖ్యలో వాహనాలు పెట్టి వలస కార్మికులను స్వస్థాలకు పంపిస్తున్న సినీ నటుడు సోనూ సూద్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కేరళలో చిక్కుకుపోయిన 177 మంది వలస కార్మికుల కోసం ఏకంగా ఓ చార్టెడ్ విమానమే ఏర్పాడు చేశారు. లాక్‌డౌన్ కారణంగా కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో ఇరుక్కుపోయిన మహిళా కార్మికుల కోసం ఈ ఏర్పాటు చేశారు. వారిని ఒడిశాకు ఈ చార్టెడ్ ఫ్లైట్‌లో తరలించనున్నారు.
177 మంది మహిళా కార్మికులు, కొచిలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. స్టిచింగ్, ఎంబ్రాయిడరీ పని చేస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా కంపెనీ మూసేయడంతో వారికి ఉపాధి కరువైంది. ఈ విషయం సోనూ సూద్ వరకు వెళ్లడంతో వారిని స్వరాష్ట్రానికి తరలించేందుకు తన టీంతో కలిసి ఏర్పాట్లు చేయడానికి పూనుకున్నాడు. ఇప్పటికే వందల బస్సుల్లో వేల మందిని తరలిస్తున్న సోనూ సూద్.. వీరిని తరలించేందుకు చార్టెడ్ విమానాన్ని ఎంచుకున్నారు.
ఈ విషయమై ఒడిశా నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు అమర్ పట్నాయక్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ‘‘సోనూ సూద్ జీ.. కేరళలో చిక్కుకుపోయిన అమ్మాయిలను ఒడిశాకు క్షేమంగా పంపిస్తుండడం ప్రశంసనీయం. మీ గొప్ప ప్రయత్నాన్ని మేము చాలా అభినందిస్తున్నాము. పేదలు తమ ఇళ్లకు చేరుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. మీకు మరింత శక్తిమంతులు కావాలి’’ అని ట్వీట్ చేశారు.