టాలీవుడ్ సినిమా షూటింగ్స్ పున: ప్రారంభంపై, సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు భేటీ కావడంపై సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య సంచలన వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం మొదలైన సంగతి తెలిసిందే. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రముఖ సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా నాగబాబు మాట్లాడుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో డిబెట్‌లో మాట్లాడుతూ బాలయ్యపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నాగబాబు తాజా వ్యాఖ్యలివీ..
అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలోని ఫ్యామిలీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సినీ పరిశ్రమ అంటే ఎన్టీఆర్, చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే కాదు. ఏఎన్నార్, కృష్ణ కుటుంబాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. మీటింగ్‌కు, ఫ్యామిలీలకు సంబంధం లేదు. బాలకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడారు. భూములు పంచుకున్నారని ఆయన అంటే.. అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని నేనూ అనగలను. బాలకృష్ణను కూడా సమావేశానికి పిలవాలని తాను బలంగా చెపుతున్నాను. మీటింగ్‌కు ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ భూములు పంచుకున్నారని అనడం మాత్రం సరిగా లేదు. ఎవరైనా భూములు తీసుకుని ఉంటే వారి పేరు చెప్పి విమర్శించవచ్చు. ఒకప్పుడు నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నాను.. ఇప్పుడు యాక్టివ్‌గా లేను. ఇండస్ట్రీపై ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడితే మాత్రం ప్రశ్నిస్తాను. నేను ఎప్పుడూ ఆయన్ను కమెడియన్ అనలేదు. బాలయ్యపై నాకు నెగెటివ్ ఒపీనియన్ లేదు. బాలయ్యతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఆయనతో వ్యక్తిగత విభేదాలు లేవు’ అని ఓ చానెల్‌కు ఇచ్చిన డిబెట్ వేదికగా నాగబాబు స్పష్టం చేశారు.
మొత్తానికి చూస్తుంటే.. తాజా పరిణామాలతో ఈ వివాదం సద్దుమణిగేలా మాత్రం కనిపించట్లేదు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై తీవ్రస్థాయిలో నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాలయ్య స్పందించి మరోసారి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసినా.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. కాగా పైకి మాత్రం మెగాస్టార్ చిరంజీవి.. బాలయ్య మిత్రులుగా ఉన్నా లోపల మాత్రం బద్ధశత్రువులనే కొందరు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో పరిస్థితులు ఎటుపోతాయో జస్ట్ వెయిట్ అండ్ సీ.