కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజల్ని గడగడా వణికిస్తోంది. చైనా నుండి ప్రపంచానికంతటా విస్తరించిన ఈ వైరస్ మనుష్యుల మీద ఆరాచకం సృష్టిస్తోంది. పెద్ద పెద్ద దేశాలే కరోనా వైరస్ ని ఏమీ చేయలేకపోతున్నాయి. మనదేశంలో లక్షకి పైగా కేసులు దాటిపోయాయి. మృతుల్లో చైనాని మించిపోయాం. కరోనాని అరికట్టడానికి లాక్డౌన్ ని పాటించినప్పటికీ, ఎక్కువ రోజులు లాక్డౌన్ పొడిగిస్తూ వెళ్లలేం కాబట్టి కరోనాతో కలిసి బ్రతకాల్సిందే అని తేల్చేశారు.
అయితే దేశంలో ఏది జరిగినా దాని మీద సినిమా తీసే రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ మీద సినిమా తెరకెక్కించాడు. కరోనా వైరస్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఒక్కడే కాదు మరో దర్శకుడు కూడా కరోనా మీద సినిమా తీయబోతున్నాడు. అ సినిమాతో అందరినీ థ్రిల్ కి గురిచేసిన ప్రశాంత్ వర్మ కరోనా వ్యాక్సిన్ పై సినిమా రూపొందించనున్నాడట.
ఈ మేరకు ఈరోజు ప్రకటన కూడా చేశాడు. ఒకరేమో కరోనా వైరస్ గురించిన భయాన్ని సినిమాగా చూపిస్తుంటే, మరొకరేమో కరోనా వ్యాక్సిన్ కనుగొనే కథాంశంతో సినిమా తీస్తున్నాడు. చాలా మంది కరోనా మీద సినిమా తీయాలని అనుకొని ఉంటారు. కానీ వారంతా ఆలోచనల్లో ఉంటే మనవాళ్ళు మాత్రం ఆచరణలోకి వచ్చేశారు. ఆ విధంగా చూస్తే కరోనా మీద సినిమా తీస్తున్నవాళ్లలో మనవాళ్ళు ముందు వరుసలో ఉంటారు.