ఈ మధ్య చాలా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇక్కడ సూపర్ హిట్ అందుకున్న చిత్రాలని హిందీలో తెరకెక్కించడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే చాలా చిత్రాలు రీమేక్ కి రెడీ అవుతున్నాయి. తాజాగా మరో తెలుగు చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కానుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ చిత్రం ఎంతటి విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. వాల్ పోస్టర్ బ్యానర్ లో నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.
తెలుగులో సూపర్ హిట్ అనిపించుకోకపోయినా బాగానే ఆడింది. మర్డర్ మిస్టరీని చేధించే క్రమంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని డాక్యుమెంటరీ తరహా డీటైలింగ్ తో చూపించిన ఈ సినిమా ప్రేక్షకులకి మంచి థ్రిల్ ని కలిగించిందనేది వాస్తవం. అయితే ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడట. ఇప్పటికే నాని నటించిన జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు హిట్ చిత్రాన్ని కూడా రీమేక్ చేయబోతున్నాడని అంటున్నారు.
హిట్ లాంటి థ్రిల్లర్లు హిందీలో బాగా ఆడతాయన్న ఉద్దేశ్యంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడట. గత కొన్ని రోజులుగా రీమేక్ లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు హిట్ రీమేక్ ద్వారా సూపర్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.