లాక్డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో విడుదలకి సిద్ధమైన అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఉధృతి తగ్గేలా లేదు. అందువల్ల థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. కానీ నాలుగవ విడత లాక్డౌన్ లో భాగంగా వ్యాపార సంస్థలకి మినహాయింపులు రావడంతో థియేటర్లు కూడా మరికొద్ది రోజుల్లో ఓపెన్ అవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
అయితే ఒకవేళ థియేటర్లు తెరుచుకుంటే వాటిల్లో ప్రదర్శితమయ్యే మొదటి సినిమా ఏదవుతుందనేది ఆసక్తిగా మారింది. తాజా పరిస్థితులని గమనిస్తే అనుష్క నటించిన పాన్ ఇండియన్ మూవీ నిశ్శబ్దం మొట్టమొదటి సినిమాగా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఎన్నో వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో థియేటర్లలోనే విడుదల అవుతుందనేది స్పష్టమైపోయింది. దాంతో థియేటర్లలో రిలీజ్ కాబోయే మొదటి చిత్రం కూడా ఇదే అవనుందేమో అనిపిస్తుంది. కోన వెంకట్ ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అదీగాక ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో అనుష్క నిశ్శబ్దం ఇప్పటివరకూ థియేటర్లలో గూడుకట్టుకున్న నిశ్శబ్దాన్ని చీల్చడానికి సిద్ధం అవుతోంది.