‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా కూడా బాహుబలిని మించిపోతుందని.. భారీగానే అంచనాలున్నాయ్. అంతేకాదు ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తుండటంతో ఆ అంచనాలు కాస్త డబుల్ అయ్యాయ్. కరోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటికే జూన్ నుంచి షూటింగ్స్ చేసుకోవచ్చని తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కీలక మార్పులు ఇలా..!
ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కరోనాకు ముందులాగా షూటింగ్స్ జరుపుకోవడం అంటే ఇప్పుడు అస్సలు సాధ్యం కాని పని. భారీగా జనాలను పెట్టడం కూడా కుదరదు. అందుకే కథలో జక్కన్న కీలక మార్పులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కూర్చొని ‘మార్పులు చేర్పులు’ చేశారట. ముఖ్యంగా భారీ యాక్షన్ సీక్వెన్స్, అవుట్ డోర్ షెడ్యూల్ సీన్స్ విషయంలో చాలా వరకు మార్పులు చేశారని.. తెలుస్తోంది. అంతేకాదు.. వీలైనంత వరకు తక్కువ మందితో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకునేలా రంగం సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే తన టీమ్‌ను అలెర్ట్ చేశారట.. షూటింగ్ రెడీగా ఉండాలని సూచించారట.
నిజమేనా!?
ఇప్పటికే ఎలాగో 70 శాతానికిపైగా షూటింగ్ అయిపోయింది గనుక.. ఉన్న కథలో మార్పులు చేయడం పెద్ద పనేమీ కాదు. అందుకే పలు సన్నివేశాలను షార్ట్ చేయడం.. కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అనుకున్న టైమ్‌కే సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్‌ను కూడా దర్శకనిర్మాతలు పెట్టుకున్నారట. కాగా తాజాగా చేసిన మార్పులు చేర్పులు మాత్రం సినిమా పెద్దగా ప్రభావం చూపదని తెలుస్తోంది. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే జక్కన్న లేదా డీవీవీ స్పందించాల్సిందే మరి.