కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిందే. కోవిడ్ 19 ప్రభావం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ప్రభావం తగ్గేలా కనిపించట్లేదు. వ్యాక్సిన్ ఇప్పట్లో వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయనేది వాస్తవం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ పై సినిమా వచ్చేస్తుంది.
వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ పై సినిమా తీశాడట. కంపెనీ నిర్మాణంలో అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కరోనా వైరస్ చిత్ర ట్రైలర్ నేడు విడుదల చేశాడు. ఒక కుటుంబంలో కరోనా లక్షణాలున్న వారిని గుర్తిస్తే ఎలా ఉంటుందనేది కథా సారాంశంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వైరస్ పై తెరకెక్కిన చిత్రంగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకుంటున్నాడు.
4నిమిషాల ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సాధారణంగా వర్మ తీసిన సినిమా ట్రైలర్ లన్నీ బాగానే ఉంటాయి. సినిమా విషయానికి వచ్చేసరికి తేలిపోతుంటాయి. మరి కరోనావైరస్ మన జీవితాలని ఏ విధంగా ప్రభావం చూపించింది అన్నది చూపించబోతున్న ఈ సినిమా కూడా ఎప్పటిలాగే నిరాశ పరుస్తుందా లేక, కొంచెం కొత్తగా ఉండనుందా అన్నది చూడాలి.