జగపతిబాబు ఏం చేసినా చాలా గొప్పగానే ఉంటుంది. ఒక చేత్తో చేసింది మరో చేతికి తెలియకుండా ఆయన గుప్తదానాలు చేస్తుంటారు. అలాంటి వ్యక్తి.. ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న సుమారు 400 మంది సినీ కార్మికులకు ఆయన సహాయం అందించారు.
లాక్‌డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక, సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు, లైట్ మన్‌లకు ఈరోజు ప్రముఖ నటుడు జగపతిబాబు నిత్యావసర సరుకులు, మాస్క్‌లు పంపిణీ చేశారు. 400 మంది సినిమా కార్మికులకు బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులు జగపతి బాబు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ మేనేజర్, భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు, జగపతి బాబు మేనేజర్ మహేష్, సహాయకుడు రవి పాల్గొన్నారు.