టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ.. హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్‌ను అధికారికంగా ప్రకటించేసింది చిత్రబృందం. కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్ ఆగిపోయింది కానీ.. లేకుంటే ఈపాటికే సగానికిపైగానే చిత్రీకరణ పూర్తయ్యేది. ఈ సినిమాలో బన్నీ సరసన స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతున్న రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇదిగో సినిమా ఇలా ఉంటుందట.. ఇదిగో స్టోరీ అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయ్. తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
ప్రభుత్వం ఒప్పుకోదేమో..!
కరోనా లాక్ డౌన్‌కు ముందు కేరళలో చిత్రబృందం షూటింగ్ చేసుకుంటున్న విషయం విదితమే. లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలుసుకున్న చిత్రబృందం హడావుడిగా హైదరాబాద్‌లో వచ్చి పడింది. అయితే.. ఇప్పుడు లాక్ డౌన్ పూర్తయిన తర్వాత షూటింగ్ జరపాలన్నా.. లేదా సడలింపులు ఇస్తే చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలన్నా అక్కడికెళ్లి జరిపేంత పరిస్థితి లేదని టాక్ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కేరళ.. కరోనా థాటి నుంచి చాలా వరకు కోలుకుంది. ఇప్పట్లో అక్కడ జనాలు గుమిగూడటం, షూటింగ్స్ చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అస్సలు ఒప్పుకోదు. ఇలా చేస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశముంది.
అక్కడేనా.. ఇక్కడేనా!?
పైగా అక్కడికి ఇక్కడకీ జర్నీలే సరిపోతాయ్.. పైగా అనుమతులు తీసుకోవడం.. ఇస్తే సరి లేకపోతే కష్టం. దీంతో కేరళలో షూటింగ్ వద్దనుకుని ఆ షెడ్యూల్‌ను స్క్రాప్ చేసి.. ప్రతిదీ కొత్తగా ప్రారంభించాలని అది కూడా లుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని దర్శకుడు సుక్కు భావిస్తున్నాడట. ముఖ్యంగా శేషాచలం లేదా నల్లమల ఫారెస్ట్‌లోనే షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు భావిస్తున్నాడట. అయితే.. అక్కడ ఇదివరకే వేసిన సెట్స్ విలువ అక్షరాలా మూడు కోట్ల రూపాయిలకు పై మాటేనట. కేరళ వదిలేసి తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్స్ చేసుకోవాలని దర్శకుడు భావిస్తే మాత్రం నిర్మాతకు ఆ మూడు కోట్ల రూపాయిలు నష్టమే. అంటే రిలీజ్‌కు ముందు మొదటి నష్టం ఇదేనన్నమాట. దర్శకనిర్మాతలు ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారో. మరి తాజా పుకారులో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం స్పందించేదాకా వేచి చూడాల్సిందే.