‘గబ్బర్ సింగ్’ చిత్రం ఏ క్షణాన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుందో కానీ నాటి నుంచి నేటి వరకూ వివాదం నడుస్తూనే ఉంది. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ పేద్ద వ్యాసమే రాసుకొచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్.. అందరి పేరునూ ప్రస్తావించి నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ పేరు మాత్రం అస్సలు ప్రస్తావించనే లేదు. దీంతో బండ్లకు బాగా చిర్రెత్తుకురావడంతో వరుస ట్వీట్స్ వర్షం కురిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇందుకు కౌంటర్‌గా హరీష్ శంకర్ కూడా ట్వీట్ చేస్తూ వచ్చాడు. అలా ఈ ఇద్దరి మధ్య రోజురోజుకూ వివాదం ముదురుతూనే ఉంది కానీ.. ఫుల్‌స్టాప్ మాత్రం అస్సలు పడట్లేదు. వీరిద్దరి మధ్యలో ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) రావడంతో మరింత అగ్గిరాజేసినట్లయ్యింది.
కౌంటర్ ఎటాక్..!
పీవీపీ కౌంటర్ ఎటాక్ చేయడంతో బండ్ల తానెందుకు తగ్గాలి అన్నట్లుగా అస్సలు తగ్గకుండా వరుస ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా.. ‘ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో.. బతికినంత కాలం బాగుపడతావ్’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో మరోసారి బండ్ల వార్తల్లో నిలిచాడు. అంతకుముందు నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే.. నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే.. నీ కెపాసిటీ తెలుస్తుంది’ అంటూ సినిమా డైలాగ్ పేల్చుతూ.. బాణం విసురుతున్నట్లున్న ఎమోజీలను బండ్ల ట్వీట్ చేశాడు. దీనిపై పలువురు నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘ఏమైందన్నా..ఎవరిమీదన్న అంత ఫ్రస్ట్రేషన్?’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఈ పని తప్ప మీరు చేసేదేముందిలే ఎవర్నో ఒకర్ని గోకుతూనే ఉండండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పీవీపీ ఏమన్నట్లు!?
‘పై నున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేడులే. నీకైతే నేనే కాకుండా డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయ (రవితేజ సినిమా)ను మించి దువ్వాడ (దువ్వాడ జగన్నాథం- అల్లు అర్జున్ మూవీ)ను దాటించే సినిమా తియ్యడానికి.. వెయిటింగ్. హరీష్ తమ్ముడు… స్టార్ట్ యువర్ కుమ్ముడు’ అంటూ పీవీపీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీ్ట్‌కు స్పందించిన బండ్ల పై విధంగా కౌంటరిచ్చాడు.