కరోనా కారణంగా పనులేమీ లేకపోవడంతో రోజువారి వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. చేయడానికి పనిలేక, పోవడానికి బండిలేక, ఇక్కడా ఉండలేక నడకతోనే తమ సొంత ఊళ్లకి ప్రయాణమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ సొంత ఊళ్లకి కాలినడకనే చేరుకున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ లో సడలింపులు ఇచ్చినా కూడా ఇంకా వారి వ్యధలు తీరట్లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని తమ స్వస్థలాలకి పంపించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
దాంతో కొన్ని ప్రభుత్వేతర సంస్థలు ఈ బాధ్యతని తమ భుజాలపై వేసుకుంటున్నాయి. వలస కూలీలని తమ సొంత ఊళ్లలో దింపడానికి బస్సుల్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి ఆకలి బాధని తీరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైమ్ కంబైన్ ఫౌండేషన్ అనే ఎన్జీవోకి టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద తనవంతు విరాళం ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ద్వారా అల్లు శిరీష్ వెల్లడి చేశాడు. ఆసక్తి ఉన్నవారు విరాళాలు పంపించవచ్చంటూ తెలియజేశాడు.
అల్లు అరవింద్ ఒక్కరే కాదు ఇంకా చాలా మంది సినిమా సెలెబ్రిటీలు వలస కూలీలకి సాయం చేస్తున్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ వలస కూలీల కోసం బస్సులు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు.