కన్నడ చిత్ర పరిశ్రమ నుండి దేశవ్యాప్తంగా చర్చించుకునే సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కేజీఎఫ్ వచ్చే వరకూ కన్నడ సినిమాల మీద అంతగా ఇంట్రెస్ట్ చూపని వారు కూడా ఒక్కసారిగా వారి తలలు తిప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అల తిప్పేలా చేసిన ఘనుడు ప్రశాంత్ నీల్. యశ్ హీరోగా రూపొందిన కేజీఎఫ్ చిత్రాన్ని దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ తన తర్వాతి చిత్రం గురించి చిన్న క్లూ ఇచ్చాడు.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేసిన ప్రశాంత్, త్వరలో వారిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. అయితే ప్రస్తుతం అదే అతని పాలిట శాపంగా మారింది. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని పుకార్లు వచ్చినపుడు సైలెంట్ గా ఉన్న కన్నడ ప్రజలు, ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ కావడంతో ప్రశాంత్ నీల్ పై విరుచుకుపడ్డారు.
కేవలం పారితోషికం కోసమే వేరే భాష హీరోతో సినిమా చేస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు. డబ్బులకోసం కన్నడని వదిలి ఇతర భాషల హీరోలతో సినిమా తీయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. కన్నడలో పేరు సంపాదించుకుని వేరే వారితో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడంటూ, సొషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. అదలా ఉంటే, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. కేజేఎఫ్ దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా ఉంటుందని తెలిసినప్పటి నుండి సంతోషంతో గంతులు వేస్తున్నారు.