జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ట్వీట్ చేసి హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. గాడ్సే పుట్టిన రోజు కావడంతో నాగబాబు వరుస ట్వీట్స్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు, ఇతర పార్టీ నేతలు, సినీ ప్రియులే కాదు.. సొంత పార్టీకి చెందిన జనసేన కార్యకర్తలు, ఆఖరికి మెగాభిమానులు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. అయితే మెగా బ్రదర్ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు కూడా స్పందించి తీవ్రంగా ఖండించారు. మంగళవారం మొత్తం దీనిపై మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
ఇలాంటి.. క్రమంలో అసలు తాను ఏ ఉద్దేశ్యంతో అన్నాను..? ఎందుకు అనాల్సి వచ్చింది..? అనేదానిపై మరోసారి మెగా బ్రదర్ వివరణ ఇచ్చుకున్నాడు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోవాలి. నేను నాథూరామ్ గురించి చేసిన ట్వీట్‌లో అతను చేసిన నేరాన్ని సమర్థించలేదు. అతని అభిప్రాయాలు ఏమిటో జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మాగాంధీ అంటే చాలా గౌరవం అని అన్నారు. వాస్తవానికి నన్ను విమర్శించే వాళ్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అని నాగబాబు వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హమ్మయ్యా.. బాబుకు బాగానే తెలిసొచ్చినట్లుంది అని కామెంట్స్ చేస్తున్నారు.