మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి నటించేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2021లోనే ఆ ఇద్దరి కాంబినేషన్‌లో నాలుగో సినిమా ప్రారంభం కానున్నది. గతంలో ఆ ఇద్దరూ కలిసి ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు చేశారు. వీటిలో ‘జల్సా’ హిట్టవగా, ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఎటొచ్చీ, ముచ్చటగా వచ్చిన మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ హ్యాట్రిక్ హిట్లను పూర్తి చేస్తుందని ఫ్యాన్స్ కొండంత ఆశలు పెట్టుకుంటే, అందుకు విరుద్ధంగా ఇద్దరి కెరీర్లలోనూ ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్ మూవీగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్ నాలుగో సినిమాను కూడా త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నది. వచ్చే ఏడాది ఈ మూవీని స్టార్ట్ చెయ్యాలని కూడా వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కారణం.. లేటెస్ట్‌గా త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ వంటి నాన్-బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసిన సినిమాను అందివ్వడం. ఆ మూవీని ఆయన తీసిన స్టైల్ కూడా వాళ్లకు బాగా నచ్చేసింది. అందుకే ఆ తరహాలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తమ హీరోకు కూడా త్రివిక్రమ్ అందించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తిచేసి, రిలీజ్ చేయించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’కు రీమేక్ అయిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తుండగా, బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. టైటిల్ రోల్‌లో పవర్ స్టార్ లుక్ అదిరిపోయిందనే రెస్పాన్స్ రావడంతో, సినిమా కోసం ఫ్యాన్స్ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. పవన్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కావడంతో దీనిపై అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. అలాగే క్రిష్ డైరెక్షన్‌లో ‘విరూపాక్ష’ (పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమాను కూడా పవన్ చేస్తున్నారు. పీరియడ్ ఫిల్మ్‌గా తయారవుతున్న ఈ మూవీలో పవన్ క్యారెక్టరైజేషన్ హైలైట్‌గా ఉంటుందని సమాచారం.