కరోనా కారణంగా థియేటర్లన్నీ మూసివేయడంతో జనాలంతా ఓటీటీ మీద పడ్డారు. సినిమా, సిరీస్ అనే తేడా లేకుండా అన్నీ చూసేస్తున్నారు. తాజాగా తెలుగులో విడుదలైన లూజర్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. జీ5 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ లో ముగ్గురు క్రీడాకారుల జీవితాల కథని చూపించారు. ఆ ముగ్గురిలో ఒకరు కమెడియన్ ప్రియదర్శి కాగా, మరొకరు సై సినిమాతో ఫేమస్ అయిన శశాంక్.. ఇంకొకరు రాజన్న సినిమాలో బాలనటిగా మెరిసిన ఆనీ..
ఈ ముగ్గురి పర్ ఫార్మెన్స్ సిరీస్ ని ఆసక్తికరంగా మలిచింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత శశాంక్ కి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అభిలాష్ రెడ్డి అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. అయితే శశాంక్ పాత్రకి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. లూజర్ వెబ్ సిరీస్ శశాంక్ కి చాలా సంతృప్తిని ఇచ్చిందట.
చూసిన వాళ్ళంతా బావుందని అనడమే కాదు, తెలుగు వెబ్ సిరీస్ లన్నింటిలో బెస్ట్ వెబ్ సిరీస్ గా చెప్పుకుంటున్నారు. మరి ఇంతటి బెస్ట్ సిరీస్ లో నటించిన శశాంక్ కి సినిమాల్లో అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కెరియర్ మొదట్లో సై, అనుకోకుండా ఒకరోజు సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేసిన శశాంక్ ఎందుకో వెనకబడ్డాడు. మరి ఈ వెబ్ సిరీస్ సక్సెస్ తోనైనా అతడికి సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి.