ఒక్కోసారి పుకార్లు కూడా మంచి చేస్తాయంటే నమ్మక తప్పదేమో. అయితే చాలా సార్లు చాలా పుకార్లు సెలెబ్రిటీలని ఇబ్బంది పెట్టేవే అయి ఉంటాయి. అయితే కొన్ని పుకార్లని తామే స్వయంగా సృష్టించుకుంటుంటారు. అదలా ఉంచితే తాజాగా ఒకానొక రూమర్ హీరోయిన్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజై 8సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అభిమానులు ట్విట్టర్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.
అదీగాక గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోమారు నటించనున్నాడు. ఈ మేరకు ప్రకటన వచ్చి చాలా రోజులవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకున్నట్లు హరీష్ ప్రకటించాడు. దీంతో హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందన్న వార్తలు జోరందుకున్నాయి. మళయాలీ భామ మానస రాధాక్రిష్ణన్ పవన్ సరసన నటించనుందని వార్తలు రాసేసారు. దాంతో హీరోయిన్ మానస గురించి సోషల్ మీడియాలో వెతికే వాళ్ళు పెరిగిపోయారు.
ఒక్కసారిగా ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తెలుగులో ఒక్క సినిమా కూడా నటించకపోయినా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని, అనవసరంగా ఇలాంటి రూమర్లు పుట్టించవద్దని ట్విట్టర్ వేదికగా హరీష్ కోరాడు. అయితే ఇలాంటి పుకార్లు దర్శకుడు హరీష్ కి చిరాకు కలిగించినా మానస రాధాక్రిష్ణన్ కి మాత్రం మంచే చేసింది. ఆమె క్రేజ్ కారణంగా త్వరలో తెలుగు సినిమాలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదేమో..!