మనదేశంలో క్రికెట్ కి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. దేశమంతా అత్యంత ఎక్కువగా చర్చించే అంశాల్లో మొదటిది క్రికెట్ అయితే రెండోది సినిమా. ఈ మధ్య కాలంలో పొలిటిక్స్ కూడా చేరినప్పటికీ, సిద్ధాంతపరమైన అంశాల కన్నా ఫలానా పార్టీ గురించే ఎక్కువ డిస్కషన్ జరగడం చూస్తుంటాం. అయితే క్రికెట్ లో పొట్టి ఫార్మాట్ వచ్చిన తర్వాత ఆదరించే వారు మరింత పెరిగారు. ఇక ఐపీల్ అన్ని దేశాల వారిని ఒక్కదగ్గరికి చేర్చింది.
అందువల్ల ఇతర దేశాల వారిని కూడా మనవాళ్లే అన్నంతగా ఆదరించడం మొదలైంది. అయితే ఆ క్రికెటర్లు కూడా ప్రేక్షకులని మనవాళ్లే అని ఫీల్ అవుతారా అన్నది ఆసక్తికర అంశం. అందరి మాటెలా ఉన్నా ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాత్రం తెలుగు వారిని తనవారే అని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. గత కొన్నేళ్ళుగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్, గత కొన్ని రోజులుగా తెలుగు పాటలకి టిక్ టాక్ వీడియోలు చేస్తూ అభిమానులకి ఆనందాన్ని పంచుతున్నాడు.
మొన్నటికి మొన్న అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ సాంగ్ ని తన భార్య, కూతురుతో కలిసి స్టెప్పులేసిన వార్నర్, ఆ తర్వాత రాములో రాములో పాటకి కూడా కాలు కదిపాడు. పాటలే కాదు సినిమాల్లోని డైలాగులని కూడా చెప్తున్నాడు. అయితే ఏది చేసినా సన్ రైజర్స్ హైదరాబాద్ కనబడేలా చేసి, హైదరాబాద్ మీద తనకి ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు. మొత్తానికి ఏదో ఒకరోజు వార్నర్ తెలుగు సినిమాల్లో కనిపించే రోజు వచ్చేలా కనిపిస్తుంది.