కరోనా కారణంగా మన జీవితాల్లో చాలా మార్పొచ్చింది. అప్పటి వరకూ వేసుకున్న ప్లాన్స్ అన్నీ చెరిపేసి మళ్లీ కొత్తవి వేసుకోవాల్సి వచ్చింది. వేగంగా దూసుకుపోతున్న ప్రపంచాన్ని ఆపి పట్టుకుని నత్తనడకన సాగేలా చేసింది. ఈ వైరస్ మనల్ని ఎప్పుడు వదులుతుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులని చూస్తున్న కొద్దీ గుండె వేగం ఇంకా హెచ్చిస్తుంది.
అయితే లాక్డౌన్ పూర్తిగా అలవాటు కావడం, కరోనాతో కలిసి బ్రతకాల్సిందే అన్న స్టేట్ మెంట్ల వల్ల పరిస్థితులు మునుపటిలా మారే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో లాక్డౌన్ మొదట్లో పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నవారు పునరాలోచనలో పడ్డారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ డా పల్లవి వర్మని మనకి పరిచయం చేసి ఏప్రిల్ 16న పెళ్ళి ఉంటుందని చెప్పాడు. కానీ లాక్డౌన్ వల్ల ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసుకున్నాడు.
అయితే ఇప్పుడు కూడా కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో ఇక మళ్ళీ వాయిదా వేయడం ఇష్టం లేక ప్రభుత్వం సూచించిన నియమాల ప్రకారం పెళ్ళి చేసుకోబోతున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం రేపు ఉదయం 6:31 గంటల ముహూర్తానికి పెళ్ళి చేసుకోబోతున్నాడు. దీనికి సాక్ష్యంగా నిఖిల్ పెళ్ళి కొడుకుగా మారిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
మొన్నటికి మొన్న టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా పెళ్ళి చేసుకున్న తెలిసిందే. నిఖిల్ లాగే నితిన్ కూడా లాక్డౌన్ లోనే పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.