పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ సినిమాకి చాలా ప్రాధాన్యం ఉంది. తమ అభిమాన హీరో ఎప్పుడు హిట్టు కొడతాడా అని ఏళ్లకి ఏళ్ళు ఎదురుచూస్తున్న టైమ్ లో వచ్చిన సినిమా ఇది. హిందీలో సూపర్ హిట్ అందుకున్న దబాంగ్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకి తగినట్టుగా, ఇంకా బాగా చెప్పాలంటే పవన్ అభిమానులకి నచ్చేవిధంగా హరీష్ శంకర్ మార్పులు చేశాడు.
దాంతో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మరో మూవీ చేస్తున్నాడు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ తాను చేయబోయే మూడు చిత్రాలని ప్రకటించాడు. ఆ మూడు చిత్రాల్లో ఒకటి వకీల్ సాబ్ కాగా రెండవది క్రిష్ దర్శకత్వంలో ఉండగా, మూడవది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ ని ఎంచుకున్నాడు.
దాంతో అప్పటి నుండి హీరోయిన్ కూడా సెలెక్ట్ అయిపోయిందనే వార్తలు ఊపందుకున్నాయి. మళయాళీ భామ మానస, పవన్ సరసన నటించనుందని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఇలాంటి వార్తలకి చెక్ పెట్టాడు డైరెక్టర్ హరీష్. సోషల్ మీడియాలో తాను అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ, అనవసర విషయాలు ఎలా రాస్తారంటూ ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు పవన్ 28వ సినిమాకి ఇప్పుడే హీరోయిన్ ని సెలెక్ట్ చేయడం కష్టం అని అంటున్నారు.
పవన్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగుల్లో పాల్గొన్నాడు. ఆ రెండు సినిమాలింకా పూర్తి కాలేదు. కరోనా వల్ల వకీల్ సాబ్ పూర్తయితే కానీ క్రిష్ సినిమా ముట్టుకోడని చెప్పేశాడు. మరి ఇలాంటి టైమ్ లో ఇప్పుడే హీరోయిన్ ని సెలెక్ట్ చేయడం ఎలా కుదురుతుందని వాదిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. కానీ కరోనా వల్ల అన్ని సినిమాల షెడ్యూల్స్ తారుమారయ్యాయి. అన్నీ కుదుటపడితే గానీ ఏ పని ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ ని సెలెక్ట్ చేసి పెట్టుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.