తెలుగు వారు ఎక్కడ ఉన్నా అక్కడ ఆవకాయ ఘుమఘుమలు రావాల్సిందే. అమెరికా వెళ్ళి తెలుగు సాంప్రదాయాలని పెద్దగా పట్టించుకోకపోయినా ఆవకాయ అంటే మాత్రం నోరూరిస్తారు. అయితే ప్రస్తుతం అమెరికా వారికే తెలుగు సాంప్రదాయల పట్ల ఎక్కువ గౌరవం ఏర్పడిందనుకోండి. తెలుగువారికి, ఆవకాయకి చాలా అనుబంధం ఉంది. పల్లెంలో పంచభక్ష పరమాన్నాలున్నా పచ్చడి కోసం వెతికేవాడే తెలుగువాడని సరదాగా చెప్తుంటారు. సరదాగా చెప్పినా అది నిజం కూడా.
వేసవిలో ప్రతీ ఇల్లు ఆవకాయ ఘుమఘుమలతో నిండిపోతుంది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ ఘుమఘుమలని ప్రతీ ఇంటికీ చేరవేస్తున్నారు. బిగ్ బాస్ మూడవ సీజన్లో జంటగా వచ్చి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయిన వరుణ్, వితికాలు అందరికీ గుర్తుండే ఉంటారు. టెలివిజన్లో వీరికి బాగా పాపులారిటీ ఉంది. క్వారంటైన్ టైమ్ లో వివిధ వంటలు చేస్తూ ప్రేక్షకులకి దగ్గరగా ఉంటున్న వరుణ్, వితికాలు ఆవకాయ రెడీ చేశారు.
ఆవకాయ కలుపుతున్న వితికా ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లాక్డౌన్ టైమ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడడమే కాదు నోరూరించే ఆవకాయ రెడీ చేసి అద్భుతం అనిపించారు. మొన్నటికి మొన్న రామ్ చరణ్ సతీమణి దోమకొండ రెసిపీతో ఆవకాయ రెడీ చేసిన సంగతి తెలిసిందే.. వీరే కాదు ఇంకా చాలామంది సెలెబ్రిటీలు ఆవకాయ రెడీ చేస్తున్నారు.