టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నేడు పెళ్ళి చేసుకోబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆయన జీవితంలోకి జీవితభాగస్వామి రాబోతుంది. ఈ విషయమై చాలా రోజులుగా అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ దిల్ రాజు వివాహం జరగబోతుంది. కరోనా వల్ల జీవితంలో ఒకలాంటి స్తబ్ధత నెలకొన్న తరుణంలో భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం మెల్లమెల్లగా కలుగుతున్న సమయంలో దిల్ రాజు తన జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానిస్తున్నాడు. భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్న ధైర్యంతో తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా ప్రారంభిస్తున్నాడు.
నిజామాబాద్ లోని తన స్వగ్రామమైన నర్సింగ్ పల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో దిల్ రాజు వివాహం జరగనుంది. పెళ్లికూతురు ఎవరనే విషయాలు ఇంకా బయటకి వెల్లడించలేదు. లాక్డౌన్ వల్ల పెళ్ళి తదితర శుభకార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి లేనందున, ఈ వివాహ వేడుకకి 15 మంది మాత్రమే హాజరవుతున్నారట. ఈ రోజు రాత్రి దిల్ రాజు మూడు ముళ్ళు వేయనున్నాడు. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.