ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి, ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఫిదా సినిమాలో తెలంగాణ గ్రామీణ అమ్మాయిగా సాయిపల్లవి అద్భుతంగా నటించింది. అయితే నటనకి ప్రాధాన్యమున్న విభిన్న చిత్రాలలో తప్ప, గ్లామర్ రోల్స్ లో చేయనని తెగేసి చెప్పిన సాయిపల్లవి, రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వంలో నటిస్తుంది.
ఇందులోనూ ఆమె తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు నక్సలిజం బాగా ఉండేది. నక్సలైట్ల నేపథ్యంలో కథని సిద్ధం చేసుకున్న వేణు ఊడుగుల సాయిపల్లవిని జానపద గాయనిగా చూపించనున్నాడని సమాచారం. అయితే నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విరాటపర్వం నుండి ఆమె లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. సాదాసీదా పల్లెటూరి అమ్మాయిగా ఊరి నడిమధ్యలో అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని, చేతిలో పెన్ను పేపరు పట్టుకుని, పక్కన బ్యాగు పెట్టుకుని ఎవరికోసమో ఎదురుచూస్తుంది.
లంగాఓణీలో అచ్చం పల్లెటూరి అమ్మాయిలా సాయిపల్లవి లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ ని చూస్తుంటే సాయిపల్లవి క్యారెక్టర్ ఎంత బాగా తీర్చిదిద్దారో అర్థం అవుతుంది. పోస్టర్ తోనే అప్పటి కాలంలోకి తీసుకువెళ్ళిన వేణు ఊడుగుల సినిమాతో మంచి అనుభూతిని ఇచ్చేలా ఉన్నాడు. ఈ సినిమాని సురేష ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.