ప్రస్తుతం తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా సినిమాల పైనే ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో తాము కూడా పాన్ ఇండియా రేంజ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే ప్రభాస్ తర్వాత అంతటి రేంజ్ ఎవరు సాధిస్తారనే ఆసక్తి జనాల్లో కూడా బాగా పెరిగింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం అవుతున్నారు.
అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ ద్వారా బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. మంచు విష్ణు మోసగాళ్లు, మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటున్నాయి. ఇకపోతే తెలుగు పరిశ్రమ నుండి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతుందట.
నిర్మాత దిల్ రాజు ఈ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పూర్తయిందని చెబుతున్నారు. నాని హీరోగా వి సినిమాని తెరకెక్కించిన ఇంద్రగంతి మోహనక్రిష్ణ ఈ పాన్ ఇండియా చిత్రానికి కథ అందించనున్నాడట. అయితే ఈ సినిమాలో నటించే హీరో కోసమే వెతుకుతున్నారట. ఇంద్రగంటి రాసుకున్న కథకి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో పాన్ ఇండియా మూవీ తీయాలని ఆలోచిస్తున్నారట. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కనుందో..!