మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి. ఆ చిత్రాల విజయాల వెనక, సినిమాలో ఉన్నన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. అలాంటి ఆసక్తికరమైన అంశాలున్న సినిమా గురించి చెప్పడానికి నేచురల్ స్టార్ నాని ముందుకొచ్చాడు. అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కి, తెలుగు సినిమా చరిత్రలో గొప్పచిత్రంగా నిలిచిపోయిన జగదేకవీరుడు అతిలోక సుందరి విషయాలు ఒక్కొక్కటిగా చెప్తున్నాడు నాని.
జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకి ఇళయరాజా సంగీతం అందించాడు. ముందుగా ట్యూన్స్ వినిపించినపుడు అన్నీ క్లాస్ సాంగ్సే అనుకున్నారట. చిరంజీవి హీరోగా రూపొందే సినిమాలో ఒక్కటైనా మాస్ పాట ఉండాలని అశ్వనీదత్ భావించాడట. కానీ ఇళయారాజా క్లాస్ ట్యూన్లు ఇచ్చేశాడు. ఆ ట్యూన్ అశ్వనీదత్ కి బాగా నచ్చింది. అందుకే దాన్ని మార్చవద్దని కోరాడట.
క్లాస్ ట్యూన్ ని మార్చకుండా మాస్ పాటగా ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో గేయ రచయిత వేటూరి, క్లాస్ ట్యూన్ తోనే మాస్ సాంగ్ చేస్తానని భరోసా ఇచ్చాడట. ఆ పాటే అబ్బనీ తియ్యనీ దెబ్బ.. ఈ పాట ఇప్పటికీ ఎంత సెన్సేషనలో అందరికీ తెలిసిందే. ఇంతకీ మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ పాట చిత్రీకరణని దర్శకుడు రాఘవేంద్రరావి కేవలం రెండు రోజుల్లోనే చిత్రీకరించాడట.