మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో రెడీ అవుతాడు. ప్లాన్ ప్రకారం ఈ ఆగస్టు చివరి వరకి ఎన్టీఆర్ అందుబాటులోకి వస్తాడని అనుకున్నాడు.
కానీ కరోనా కారణంగా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కాబట్టి సినిమా ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అదీగాక ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద బడ్జెట్ సినిమాకి వందలాది మంది పనిచేయాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటించాలన్న నేపథ్యంలో పెద్ద సినిమాల షూటింగులకి ఇప్పుడప్పుడే అనుమతులు వచ్చేలా లేవు.
దాంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి అంత తొందరగా దొరికేలా కనిపించట్లేదు. అందువల్ల ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఏదైనా ఒక చిన్న సినిమా తీస్తే బాగుంటుందేమో అని అభిప్రాయపడుతున్నారు. చిన్న సినిమాలకి ఎక్కువ మంది వర్కర్లు పనిచేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, అ.. ఆ లాంటి సినిమా తీయడం మంచిదని సలహా ఇస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో చూడాలి.