గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. రాజకీయ, వ్యాపారవేత్తల బయోపిక్ లతో పాటు క్రీడాకారుల జీవిత చరిత్రలని వెండితెర మీదకి తీసుకొస్తున్నారు. రెజ్లింగ్ క్రీడాకారులైన గీతా ఫోగాట్, బబితా ఫోగాట్ ల గురించి తీసిన దంగల్ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. భారత క్రికెటర్ ధోనీపై వచ్చిన ధోనీ కూడా విజయం అందుకుంది.
క్రికెట్ లో భారతదేశానికి ప్రపంచకప్ ని అందించిన కపిల్ దేవ్ జీవితంపై 83 అనే సినిమా వస్తుంది. ఇందులో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా కనిపిస్తున్నాడు. ప్రపంచకప్ ప్రధానాంశంగా ఈ సినిమా ఉండనుంది. అయితే ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన జీవిత చరిత్రని వెండితెర మీద చూడడానికి ముచ్చటపడుతున్నాడు. రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పిలవబడే ఈ ఫాస్ట్ బౌలర్, తన జీవిత కథని సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట.
అయితే షోయబ్ కోరుకున్నా సల్మాన్ ఖాన్ ఈ సినిమా చేయడం కష్టమే అని అంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అదీగాక ఈ వయసులో సల్మాన్ ఖాన్ క్రికెటర్ గా కనిపించడం సాధ్యం కాదని చెబుతున్నారు. మరి ఈ విషయమై సల్మాన్ ఖాన్ పెదవి విప్పుతాడేమో చూడాలి.