నారా రోహిత్ సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కథా, కథనాలే కాదు, ఆయన చేసే పాత్రల్లోనూ వైవిధ్యం ఉంటుంది. తన మొదటి సినిమా బాణంతో తానేంటో నిరూపించుకున్న నారా రోహిత్, పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సోలో సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చాలా విభిన్న చిత్రాలు తీసినప్పటికీ సోలో అంతటి హిట్ సాధించలేకపోయాయి. కాకపోతే నారా రోహిత్ సినిమాలంటే ఏదో ప్రత్యేకత ఉంటుందన్న నమ్మకం ఏర్పడింది.
శ్రీ విష్ణు హీరోగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో నారా రోహిత్ చాలా మంచి పాత్ర పోషించాడు. అలాగే శమంతకమణి సినిమాలో పోలీస్ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. హీరోగానే కాకుండా అతిధి పాత్రలు చేసిన రోహిత్, ప్రస్తుతం మరో కొత్త సినిమాతో మన ముందుకు రానున్నాడట. ఇదిలా ఉంటే, తాజాగా నారా రోహిత్ సోషల్ మీడియాలో జాయిన్ అయ్యాడు. 11ఏళ్ళ క్రితం ఇదేరోజున(మే 5వ తేదీన) బాణం సినిమా కోసం మొదటిసారిగా ముఖానికి రంగేసుకున్నాడు. ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో జాయిన్ అయ్యాడు. ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.