అర్జున్ రెడ్డి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ కోసం దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ మూవీలో చేస్తున్న విజయ్, తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉండనుందనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇదిలా ఉంటే, విజయ్ తర్వాతి చిత్రం గురించి అనేక పుకార్లు వస్తున్నాయి. నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉంటుందని అన్నారు. అయితే తాజాగా విజయ్ సినిమా గురించి మరో వార్త కూడా బయటకి వచ్చింది. అష్టాచమ్మా సినిమాతో నానీని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో సినిమా ఉండనుందని అంటున్నారు.
ఇంద్రగంటి మోహనక్రిష్ణ ఇప్పటి వరకు చేసినవన్నీ క్లాస్ సినిమాలే. మరి ఈ క్లాస్ దర్శకుడు విజయ్ లాంటి రౌడీస్టార్ ని ఎలా డీల్ చేయగలుగుతాడనేది సందేహంగా ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉందని వార్తలు వస్తున్నాయి కానీ, ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టత రాలేదు. ఫైటర్ తర్వాత శివ నిర్వాణ సినిమానే కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనూ సినిమా ఉంటుందని అన్నారు. అయితే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాతే ఈ విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.