కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు సర్వం బంద్ అయ్యాయి. బహుశా ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరేమో. ఈ కరోనా దెబ్బతో నిర్మాతలు ఇప్పట్లో కోలుకోలేరు. బహుశా సినిమా థియేటర్లకు జనాలు రావాలంటే ఇప్పట్లో అస్సలు అవ్వదు.. వచ్చే ఏడాది దాకా పరిస్థితులు అనుకూలించవ్. ఈ మాటలు స్వయంగా పేరుమోసిన నిర్మాతలు నోటి నుంచి వచ్చినవే. లాక్ డౌన్ తర్వాత ఇప్పటి వరకూ అనుకున్న సినిమాలు.. కొత్తగా నిర్మించాలన్నా సదరు నిర్మాణ సంస్థలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. పారితోషికం, ఖర్చులు వగైరా విషయాల్లో ఇదివరకటిలా పరిస్థితులు ఉండవ్. అవసరమైతే పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. ఇదిగో ఇంత మాత్రమే ఇవ్వగలం అని నిర్మాతలు చెబితే మిన్నకుండా తీసుకోవాల్సందే.. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయ్.
టాలీవుడ్ బావుండాలంటే..!
అయితే.. తాజాగా ఇదే విషయమై ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. కరోనా తర్వాత నటులు, దర్శకులు వారి రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటే బావుంటుందని.. అలా చేస్తేనే మంచిదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. ఇందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పాడాయన. ఏ వ్యాపారమైనా లాభసాటిగా ఉండదని.. అలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని వదులుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే లాభాలు లేనప్పుడు నటులు, దర్శకులు కూడా కొన్నింటిని వదులుకోవాలని.. పరోక్షంగా పారితోషికం విషయాన్ని గుర్తు చేశారు. అంతటితో ఆగని ఆయన.. టాలీవుడ్ ఇండస్ట్రీ బావుండాలంటే పొదుపు చర్యలు తప్పక పాటించాల్సిందేనని.. తక్కువ సమయంలో ప్రభావవంతమైన సినిమాలు చేయాలని ఈ సందర్భంగా దర్శకులు, హీరోలకు ఆయన సూచించారు.
అవ్వాల్సిందే లేకుంటే..!
ఇప్పటికే పలువురు ప్రముఖ నిర్మాతలు, నటీనటులు కూడా ఇదే మాటలు చెప్పారు. ఇటీవలే ఓ ప్రముఖ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్.. పారితోషికం విషయమై పెద్ద పెద్ద స్టార్‌లు కాంప్రమైజ్ కావాల్సిందేనని తాను కూడా కచ్చితంగా అవుతానని పరోక్షంగా తేల్చి చెప్పేశారు. వాస్తవానికి ఇలా చేయకపోతే ఆ హీరోను పక్కనెట్టేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి మన హీరోలు, దర్శకులు పారితోషికం విషయంలో పెద్దల మాటను ఏ మాత్రం లెక్కచేస్తారో..? ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్‌ల సంగతేంటో..? ఎంత మంది ఈ కండిషన్‌కు ఒప్పుకుంటారో..? వ్యతిరేకించే వాళ్లు ఎంతమందో తెలియాలంటే మళ్లీ సినిమాలు పట్టాలెక్కేంత వరకూ వేచి చూడక తప్పదు మరి.