టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. బాలీవుడ్‌లో పేరుగాంచిన డైరెక్టర్ కమ్ నిర్మాత కన్ను జూనియర్ ఎన్టీఆర్‌పై పడింది. అందుకే భారీ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా స్వయంగా తానే నిర్మించాలని భావిస్తున్నాడట. ఆయన స్టార్ డైరెక్టర్ కావడంతో ఈ వార్తలు విన్న నందమూరి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు..? చాలా మందే హీరోలున్నారు.. అందులోనూ సీనియర్‌లు కూడా ఉన్నారు.. వారందర్నీ వదిలి ఎన్టీఆర్‌తోనే ఎందుకు చేయాలనుకుంటున్నాడు..? అనే ఆసక్తికర విషయాలను www.cinejosh.com అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
భారీ చిత్రం..
ఆ స్టార్ డైరెక్టర్ కమ్ నిర్మాత మరెవరో కాదండోయ్.. సంజయ్ లీలా బన్సాలి. ఇప్పటికే బాలీవుడ్‌లో తనకంటూ ఓ రేంజ్, పిచ్చ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్ ఈయన. టాలీవుడ్‌లోనూ వేలుపెట్టి తన రేంజ్ ఏంటో తెలుగు సినీ ప్రియులకు రుచి చూపించాలని ఆయన తహతహలాడుతున్నాడట. ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ ఒకేసారి ఓ మంచి పీరియాడికల్ కథతో తెరకెక్కించాలని భావిస్తుండగా.. ఎన్టీఆర్ గుర్తొచ్చాడట. జూనియర్ యాక్టింగ్ బాగా నచ్చడంతో ఆయన ఫిక్సయిపోయాడట. బుడ్డోడితోనే సినిమా చేయడమే కాదు.. తానే నిర్మాతగా వ్యవహారించాలని కూడా అనుకున్నాడట. అంటే ఎన్టీఆర్‌పై ఆయన గట్టి నమ్మకమే పెట్టుకున్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా చరిత్రాత్మకంగా (పీరియాడికల్) ఉంటుందట. అంతేకాదండోయ్.. ఎన్టీఆర్ హీరో అయితే ఇందులో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ విలన్‌గా నటిస్తాడని కూడా టాక్ నడుస్తోంది. పీరియాడికల్ చిత్రాలను తెరకెక్కించడంలో సంజయ్‌కు దిట్ట అనే పేరుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూనియర్ బర్త్ డే అనగా మే-20న ఇందుకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని బన్సాలీ భావిస్తున్నాడని టాక్.
షేక్ చేయనుందట..
కాగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీనే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో 30వ సినిమా అని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 31వ సినిమా మాత్రం అటు బాలీవుడ్‌ను.. ఇటు టాలీవుడ్‌ను షేక్ చేయబోయే సినిమా అన్న మాట. త్రివిక్రమ్ మూవీ ఇంకా సెట్స్‌పైకే వెళ్లలేదు కానీ ఇలా 31 సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిప్పులేనిదే పొగ రాదు కదా.. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి నోట ఇందుకు సంబంధించి ఏదో ఒక లీక్ వచ్చివుండబట్టే ఇలా వార్తలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ఎన్టీఆర్ పెదవి విప్పాలి లేదా అటు బన్సాలీ అయిన క్లారిటీ ఇచ్చుకోవాలి మరి.