వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకి ఊతమిచ్చింది. తెలుగు సినిమాల పరిధి కూడా పెరగడంతో దర్శక నిర్మాతలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్, చిత్రీకరణ దశలో ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
అయితే గత ఏడాది నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ కి దర్శకుడిగా స్వరూప్ వ్యవహరించాడు. మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్న స్వరూప్ భవిష్యత్తులో తాను చేయబోయే ప్రాజెక్టులతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్టుల గురించి చెప్పాడు. మల్టీస్టారర్ చిత్రాలని ఇష్టపడే స్వరూప్, బన్నీ- ఎన్టీఆర్ లు హీరోలుగా సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నాడట.
అలాగే బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్, ప్రభాస్ లని హీరోలుగా పెట్టి భారీ మల్టీస్టారర్ తీయాలని ఉందట. ఇదే అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు. ప్రస్తుతం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సీక్వెల్ రెడీ చేస్తున్న స్వరూప్ కోరికలు ఇప్పట్లో తీరేలా లేవు.