సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవిగారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు (సిసిసి) ప్రముఖ సీనియర్ నటులు గిరిబాబుగారి తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ లక్ష రూపాయలను నెఫ్ట్ ద్వారా సీసీసీకి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్‌కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇచ్చారు.
ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం మన ప్రపంచం ఎంతదారుణస్థితిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. కరోనా కోట్లాదిమంది ప్రజలు అతలాకుతలమయిపోతున్నారు. మన తెలుగు చిత్ర సీమలో వేలాదిమంది కార్మికులు.. రోజువారి జీత కార్మికులు నానాకష్టాలు పడుతున్నారు. వాళ్లందరి సహాయార్థం కోసం మన మెగాస్టార్ చిరంజీవిగారు సిసిసి అనే సంస్థను ఏర్పాటు చేశారు. దయగల మన సినీ కళాకారులందరు ఎంతోమంది విరాళాలు ఇచ్చారు.. ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఆ సంస్థ ఛైర్మన్ చిరంజీవిగారు.. కమిటీ సభ్యులు సురేష్ బాబుగారు.. తమ్మారెడ్డి భరధ్వాజ్‌గారు, సి.కల్యాణ్ గారు, బెనర్జీగారు, దాముగారు, ఎన్ శంకర్‌గారు, మెహర్ రమేష్‌గారు..వీళ్లందరి నేతృత్వంలో ఆ విరాళాలు ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ప్రతి పేదవాడి నోటికి అందిస్తున్నారు. ఈ సంస్థలో మనం కూడా భాగస్వాములమవుదాం. ప్రతి పేదవాడి నోటికి పట్టెడన్నం పెడదాం. ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి. కరోనాని తరిమి కొట్టండి. జైహింద్’’ అని తెలిపారు.