సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడనేది సస్పెన్స్ గా మారింది. వంశీ పైడిపల్లితో క్యాన్సిల్ అయిన దగ్గరి నుండి గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా ఉంటుందని వార్తలొచ్చినా కన్ఫర్మేషన్ రాలేదు. అయితే తాజాగా పరశురామ్ ఒకానొక ఇంటర్వ్యూలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చేశాడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహేష్ బాబు ఒక్కడు సినిమా చూసిన తర్వాతే సినిమాల్లోకి రావాలన్న కోరిక కలిగిందని చెప్పాడు.
సినిమాల్లోకి రావాలన్న కోరిక ఎవరైతే కలిగించారో, ఆ హీరోతోనే సినిమా చేయడం నా అదృష్టం అని చెప్పుకొచ్చాడు. అయితే పరశురామ్ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ క్లాస్ సినిమాలే. యువత నుండి మొదలు పెడితే మొన్న వచ్చిన గీత గోవిందం వరకూ క్లాస్ సినిమాలే. ఒక్క ఆంజనేయులు సినిమాలోనే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.
అయితే ఇప్పుడు సూపర్ స్టార్ తో సినిమా ఎలా ఉంటుందన్న సందేహం ప్రతీ ఒక్కరిలో ఉంది. అయితే దీనికి సమాధానం ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మహేష్ తో చేసే సినిమాలో అభిమానులకి కావాల్సినవన్నీ ఉంటాయి. హీరో ఎలివేషన్స్ తో పాటు డైలాగులు కూడా బాగుంటాయి. ఇప్పటి వరకు తాను అలాంటి సీన్స్ రాయలేదంటే దానికి కారణం ఆ అవకాశం రాకపోవడమే అని, అంతే కానీ రాయడం చేతకాక మాత్రం కాదని అన్నాడు. మరి చూడాలి పరశురామ్ మహేష్ ని ఏ విధంగా ఎలివేట్ చేస్తాడో..