తెలుగు సినిమాలకి హిందీలో మంచి గిరాకీ ఏర్పడింది. అందుకే ఇక్కడి సినిమాలని హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ వేదికగా విడుదల చేస్తున్నారు. హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాలకి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. తెలుగులో ఫ్లాప్ అయిన చిత్రాలకి కూడా మిలియన్స్ లో వ్యూస్ ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే మాస్ మసాలా చిత్రాలకి ఈ వ్యూస్ మరింత ఎక్కువగా ఉంటున్నాయి.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా సరికొత్త రికార్డుని అందుకున్నాడు. ఆదిత్య మూవీస్ ద్వారా హిందీలో డబ్ అయిన ఈ సినిమా హిందీ జనాలకి బాగా నచ్చేసింది. రామ్ పర్ ఫార్మెన్స్ తో పాటు, నిధి, నభా హీరోయిన్ల అందాలు వారిని కట్టిపడేసాయి. అందుకే కేవలం 45రోజుల్లోనే వంద మిలియన్ల వ్యూస్ ని దాటింది. దీంతో రామ్ హీరోగా నటించిన నాలుగవ చిత్రం వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
అంతకుముందే ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ హిందీ వర్షన్స్ యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా వంద మిలియన్ల క్లబ్ లో చేరింది. ఒకే హీరోకి చెందిన నాలుగు సినిమాలు ఈ ఫీట్ సాధించడంతో రికార్డుగా మారింది.