అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుశాంత్, కాళిదాసు సినిమాతో తెలుగు తెరకి పరిచయమై కరెంట్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సుశాంత్ హీరోగా చేసిన సినిమాలేవీ హిట్ కాకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని చిలసౌ సినిమాతో ముందుకు వచ్చాడు. అందాల రాక్షసిలో ఒకానొక హీరోగా కనిపించిన రాహుల్ రవీంద్ర చిలసౌ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లేకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది.
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సుశాంత్ ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. నాగచైతన్య- సమంత ఎంగేజ్ మెంట్ లో రాహుల్ రవీంద్ర చిలసౌ కథ వినిపించాడట. ఆ కథ విన్నప్పుడే సినిమా తనకి బాగా సెట్ అవుతుందని అనుకున్నాడట. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోయినా కథ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకున్నాడట.
చివరికి అతని నమ్మకమే గెలవడంతో, కొన్ని కొన్ని సార్లు ఇతరులపై ఆధారపడకపోవడమే మంచిదని అనుకున్నాడట. అప్పటి నుండి స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడట. అలా తీసుకున్న నిర్ణయం వల్లనే అల వైకుంఠపురములో సినిమాలో నటించాడట. ప్రస్తుతం సోలో హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రాన్ని చేస్తున్నాడు.