మెగా బ్రదర్స్‌లో ఒకరికొకరికి మాటల్లేవని.. ‘తమ్ముడు’పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పద్ధతులు ‘అన్నయ్య’ మెగాస్టార్ చిరంజీవికి నచ్చట్లేదని.. పవన్ పార్టీ పెట్టడం చిరుకు ఇష్టం లేదని అందుకే 2019లో జరిగిన ఎన్నికల్లో కనీసం మద్దతు కూడా ఇవ్వలేదని.. వైసీపీలో చేరేందుకు మక్కువ చూపిస్తున్నాడని అందుకే కనివినీ ఎరుగుని రీతిలో సీట్లు దక్కించుకుని సీఎం సీటుపై కూర్చున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరు భేటీ అయ్యాడని ఇలా మెగా ఫ్యామిలీపై చిత్ర విచిత్రాలుగా వార్తలు వెల్లువెత్తాయ్. అయితే అసలు పైన చెప్పిన విషయాల్లో నిజానిజాలెంత..? అనే విషయాలకు ఇటీవలే ఓ ఇంటర్వ్యూ వేదికగా మెగాస్టార్ తన మనసులోని మాటను బయటపెట్టి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మెగాభిమానుల్లో ఎక్కడలేని ఆనందం నెలకొంది.
చిరు.. ఫుల్ కారిటీ
‘వైఎస్ జగన్‌ను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ వ్యవహారం లేదు. వైఎస్ ఫ్యామిలీతో నాకున్న అనుబంధంతో మాత్రమే కలిశాను. వాస్తవానికి జగన్ సీఎంగా ప్రమాణం చేసిన రోజే వెళ్లాల్సి ఉంది కానీ నేను కాలి నొప్పితో బాధపడుతున్నా.. అందుకే వెళ్లలేకపోయా. నేను జగన్‌ను కలిసిన తర్వాత చాలా పుకార్లు వచ్చాయ్. నేను వైసీపీలో చేరను.. నాకు అసలు రాజకీయాల్లోకి మళ్లీ రావడం ఇష్టం లేదు.. ఆ ఆలోచనే నాకు లేదు. తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నేనొక పార్టీలో, తమ్ముడు మరొక పార్టీలో ఉంటే మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధించే అభిమానులు అయోమయానికి గురవుతారు. అందుకే అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే జనసేనకు మద్దతు ఇస్తున్నాను. పవన్ గురించి నాకు పూర్తిగా తెలుసు.. చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. ఈ రోజు కాకపోయినా... రేపటి రోజైనా పవన్ అనుకున్నది సాధిస్తాడు. ఒక అన్నగా పవన్‌పై నాకు నమ్మకం ఉంది. మా దారులు వేరైనా... గమ్యం మాత్రం ఒకటే’ అని చిరు ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను.. ఇన్ని రోజులుగా అభిమానుల్లో నెలకొన్న అనుమానాలను నివృతి చేశారు.
టాప్ లేపుతారో..!
మొత్తానికి చూస్తే.. చిరు-పవన్ ఒక్కటయ్యారన్న మాట. మెగాభిమానుల్లో ఇక నూతనోత్సాహమే. మరి ఇది మాటల వరకే పరిమితం అవుతుందా లేకుంటే.. 2024 వరకూ ఇవే మాటలు వినిపించి.. కనిపించి.. ఎన్నికల్లో ఏమైనా ప్రయోజనాలు చేకూరుస్తాయా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ బ్రదర్స్ ఇద్దరూ ఒక్కటయితే మాత్రం మునుపటి కంటే పరిణామాలు కాస్త మెరుగ్గానే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం 2024 మాదేనని.. అటు పవర్ స్టార్.. ఇటు మెగాస్టార్ ఇద్దరూ టాప్ లేపుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఏం జరుగుతుందో జస్ట్ వెయిట్ అండ్ సీ..!